Telangana : ఆ ఇద్దరినీ ప్రమాణ స్వీకారం చేయించవద్దు.. హైకోర్టు ఆదేశం

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎంపికయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది

Update: 2024-01-30 11:21 GMT

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎంపికయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ప్రమాణ స్వీకారం చేయించవద్దని తెలిపింది. ఇటీవల గవర్నర్ కోటా కింద ప్రభుత్వ సిఫార్సు మేరకు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

ఇద్దరి పిటీషన్లతో...
గత కొద్ది రోజులుగా వారు ప్రమాణస్వీకారం చేయాలని భావిస్తే ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. అయితే తమ పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా రాజ్‌భవన్ కు పంపిన దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గత కేబినెట్ చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొంది. దీనిపై హైకోర్టు యధాతిధి కొనసాగిస్తూ విచారణను వచ్చే నెల ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News