గవర్నర్ యాక్షన్‌కు కవిత రియాక్షన్
గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు
తెలంగాణ మంత్రిమండలి గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. శాసనమండలి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా? లేక భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. గవర్నర్‌లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను కాలరాచేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు.
బీసీ వ్యతిరేక...
రాజ్యాంగంలో ఎవరి పరిధులు వారికుంటాయన్న కవిత గవర్నర్ల వ్యవహారశైలి అనుమానంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువయిందని ఆమె అభిప్రాయపడ్డారు. మంత్రి మండలి సిఫార్సు చేసిన రెండు పేర్లు బడుగు, బలహీనవర్గాలకు చెందినవని ఆమె తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వారిని చట్టసభలకు పంపాలన్న సదుద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పేర్లను పంపితే వాటిని తిరస్కరించడమేంటని కవిత ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత అన్నారు.