KTR : కేటీఆర్ అరెస్ట్ కు అంతా సిద్ధమయినట్లేనా? ఆయన కూడా ప్రిపేర్ అయ్యారా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కు ఇక రంగం సిద్ధమయినట్లే కనిపిస్తుంది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కు ఇక రంగం సిద్ధమయినట్లే కనిపిస్తుంది. రేపు కేటీఆర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట కేటీఆర్ హాజరుకానున్నారు. తర్వాత ఏసీబీ అధికారులు విచారణకు పిలిచే అవకాశముంది. ఇప్పటికే కేటీఆర్ ను ఒకసారి విచారించిన ఏసీబీ అధికారులు మరొకసారి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఈ వారంలోనే కేటీఆర్ కు సమన్లు ఇవ్వాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురు దెబ్బతగిలింది. హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఫార్ములా ఈ రేసు కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఏసీబీ మరోసారి పిలిచి...
ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో యాభై నాలుగు కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు మళ్లించారని ఆయనపై ఇటు ఏసీబీ, అటు ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని, క్విడ్ ప్రోకో జరిగిందని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు విదేశీ సంస్థలకు మళ్లించడం వెనక అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఏసీబీ, ఈడీలు సిద్ధమయ్యాయి. ఏసీబీ ఇప్పటికే ఒకసారి విచారణచేసి కొన్ని వివరాలను సేకరించింది.
అరెస్ట్ తర్వాత...
ఈడీ విచారణ పూర్తయిన తర్వాత మరోసారి ఏసీబీ అధికారులు విచారణకు పిలిచి ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ కూడా అందుకు మానసికంగా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. తాను ఈ కేసులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే తాను ఒప్పందంలో భాగంగా నిధులను విడుదల చేశామని తెలిపారు. అంతే తప్ప ఇందులో తనకు మరో స్వార్థ ప్రయోజనం లేదని కూడా పదే పదే చెబుతూవస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇప్పటికే చర్చించారు. ఆయన జైలుకెళితే పార్టీని నడపటం, కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించడంపై కూడా నేతలు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ రేపో, మాపో అన్నట్లుగా ఉంది.