ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో
హైదరాబాద్ : స్విట్జర్లాండ్ కు చెందిన సంతాన సాఫల్య వైద్యచికిత్స, ప్రసూతి ఆరోగ్య మందుల ఉత్పత్తి సంస్థ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ హైదరాబాదులో కాలుమోపింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌లో హైదరాబాద్ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తుందని కేటీఆర్ కొనియాడారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కంపెనీ కార్యక్రమాలు స్విట్జర్లాండ్ వేదికగా కొనసాగుతాయని తెలిపారు. ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ లో తల్లీ బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని మంత్రి తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింగ్ కంపెనీ ఏర్పాటయిందన్నారు.