ఊయలలో ఉన్న పసికందు వేలు కొరికిన కోతి
నొప్పితో చిన్నారి గుక్కపట్టి పెద్దపెట్టున ఏడవడంతో.. ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని కోతులను..
మహబూబాబాద్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 23) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఊయలలో పడుకోబెట్టిన చిన్నారి కాలివేలుని కోతులు కొరికేశాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు 45 రోజుల పాప ఉంది. లావణ్య కాన్పు కోసం మోదుగలగూడెంలోని పుట్టింటికి వెళ్లి.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. చిన్నారిని ఊయలలో నిద్రపుచ్చి ఇంట్లో ఉన్నవారు నీళ్లకోసం బయటికి వెళ్లారు.
ఆ సమయంలో ఆ పరిసరాల్లోకి వచ్చిన కోతులు.. ఊయల వద్దకు చేరి చిన్నారిపై దాడి చేశాయి. పసికందు వేలును కొరికేశాయి. నొప్పితో చిన్నారి గుక్కపట్టి పెద్దపెట్టున ఏడవడంతో.. ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని కోతులను తరిమేశారు. అనంతరం చిన్నారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం పసికందును వరంగల్‌కు తరలించారు. కాగా.. నాలుగు రోజుల క్రితం తెలంగాణలోనే ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచి చంపాయి. తాజాగా మరో చిన్నారిపై కోతులు దాడి చేయడంతో.. తల్లిదండ్రులు చిన్నారులను ఒంటరిగా వదలవద్దని అధికారులు సూచిస్తున్నారు.