సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపు గురించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఐదారు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని.. జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెల సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయని వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారని అన్నారు. సమైక్య పాలకులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను చాలా బాధలు పెట్టారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తా అని తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చాలా సార్లు హామీ ఇచ్చారని.. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని అన్నారు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదన్నారు. క్రమబద్ధీకరణ జరగలేదని.. జీతాలివ్వండని అర్ధించాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదన్నారు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. సకాలంలో జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేవి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఏ మాత్రం క్షమార్హం కాదని.. వెంటనే వారి సమస్యలు తీర్చాలని రేవంత్ రెడ్డి కోరారు.