పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమమయింది. అయినా సరే ఇప్పటి వరకూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు. కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ జనాల్లోకి అందులోనూ మహిళల్లోకి బాగా ప్రాచుర్యం పొందింది. మహిళలకు బంగారం అంటే అత్యంత ఇష్టం కావడంతో వారి బలహీనతను చూసి హామీని ఇచ్చారని అప్పట్లో విపక్షాలు కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేశాయి. అయితేనేం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంత వరకూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలుకు పూనుకోలేదు.
గత ప్రభుత్వం...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదును మాత్రమే ఇచ్చేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా కలిపి ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలోని మహిళలు ఎక్కువ మంది ఈ పథకం ఎప్పుడు అమలవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏడాది నుంచి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లయ్యాయి. దారిద్ర్యరేఖకు దిగువన ఉండే పేద మహిళలందరికీ ఈ పథకం గత ప్రభుత్వం అందించింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ దీనిపై ఎలాంటి విధివిధానాలను కూడా రూపొందించకపోవడంతో ఈ సీజన్ కు కూడా అందదన్న విషయం తెలిసి నిరాశకు గురవుతున్నారు.
బంగారం ధర పెరగడంతో...
తులం బంగారం ధర ఇప్పుడు 70 వేల రూపాయలకు పైగానే ఉంది. ఒక్కొక్కకుటుంబానికి 1,70లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఒక కుటుంబానికి ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనే. అందులోనూ ఈ సీజన్ లో లక్షల సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కానీ ఈ పథకం అమలు చేస్తామని మాత్రం ప్రభుత్వం లోని పెద్దలు చెబుతున్నారు. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం డేట్ ఫిక్స్ చేయడం లేదు. పెళ్లిళ్లు అయిపోతున్న తరుణంలో ఈ స్కీమ్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పెళ్లిళ్లకు ఈ పథకాన్ని ఇస్తారా? లేక ఫలానా తేదీ నుంచి అయిన వివాహాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే త్వరలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలన్న యత్నంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now