ఆగస్టు 3 నుంచి తెలంగాణ ఆఖరి అసెంబ్లీ సమావేశాలు షురూ
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్న 40-50 అంశాల పై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా..
ఆగస్టు 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక నిర్వహించే బీఏసీ మీటింగ్ లో ఎన్నిరోజులపాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్న 40-50 అంశాల పై రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, వాటిపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. అలాగే అకాల వర్షాల కారణంగా వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేసి, ప్రత్యామ్నాయంగా అనుసరించాల్సిన విధానాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణంతో పాటు.. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ సెషన్స్ ను సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.