Breaking : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూల్చివేత నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటితో పాటు ఆయన కార్యాలయానికి నోటీసులు పంపిణీ చేశారు.

Update: 2024-08-29 03:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలపై సీరియస్ గా ఉన్నారు. తనవారైనా, పరాయి వారైనా... ఎవరైనా సరే నిర్మాణాలను కూల్చి వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటితో పాటు ఆయన కార్యాలయానికి నోటీసులు పంపిణీ చేశారు. దుర్గం చెరువు పరిధిలో ఈ నిర్మాణాలు వెలిశాయి. ఇక్కడ ఉన్న మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలో ముఖ్యమంత్రి సోదరుడితో పాటు అనేక మంది వీఐపీలు భవనాలను నిర్మించుకున్నారు. ఈ సొసైటీ పరిధిలో చేపట్టిన నిర్మాణాలు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

కూల్చకుంటే...
దుర్గం చెరువుకు పక్కనే ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్, కావూరీహిల్స్, అమర్ సొసైటీలో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని 23(1) సెక్షన్ కింద రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు నోటీసులు అందచేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలను నిర్ణీత గడువులోగా కూల్చివేయాలని యజమానులకు నోటీసులు ఇచ్చారు. లేకుంటే తామే కూల్చివేతలు చేపడతామని నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే సంపన్నుల ఇళ్లతో పాటు వాణిజ్య సముదాయాలకు కూడా రెవెన్యూ నోటీసులు ఇచ్చారు. దీంతో అక్కడ నివాసముంటున్న వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.

84 ఎకరాలకు చేరుకుని...
దుర్గం చెరువు పూర్తిగా కుచించుకుపోయింది. దీనిని సీక్రెట్ లేక్ గా పిలుస్తారు. కొన్నేళ్ల నుంచి దుర్గం చెరువు వెంట ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. దీంతో వంద ఎకరాల దుర్గం చెరువు 84 ఎకరాలకు చేరింది. ఇటీవల రెవెన్యూ అధికారులు కొలతలు వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ఈ ప్రాంతాన్ని నాన్ డెవలెప్‌మెంట్ జోన్ గా గుర్తించారు. అయితే తుది నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. దీంతో ఆక్రమణలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడ పొలిటికల్ లీడర్లు, న్యాయమూర్తులు, ఇంజినీర్లుతో పాటు అనేక మంది సంపన్నులు చెరువు చుట్టూ నిర్మాణాలను చేపట్టి నివాసముంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి తమ్ముడిని కూడా వదలకుండా కూల్చివేతలకు సిద్ధమయ్యారు.



Tags:    

Similar News