Revanth Reddy : మంత్రుల పనితీరుపై రేవంత్ అసంతృప్తిగా ఉన్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆయన వారిపనితీరు పట్ల కొంత అసహనంతో ఉన్నారని సమచారం. అయితే ఇందుకు స్వీట్ వార్నింగ్ కూడా వారికి ఇచ్చినట్లు చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసి శుభాకాంక్షలు తెలియజెప్పేందుకు వచ్చిన మంత్రులు కొందరికి కొంతకటువుగా, మరికొంత మెత్తగానే వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వారికి దిశానిర్దేశం కూడా చేశారని చెబుతున్నారు. తాను మారారని,మీరు కూడా మారాలంటూ రేవంత్ రెడ్డి కొందరు మంత్రులతో అన్నట్లు సమాచారం. లేకుంటే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించినట్లు తెలిసింది.
ఏడాది గడిచినా....
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది గడుస్తుండటంతో మంత్రులకు ఈ రకమైన వార్నింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినట్లు తెలిసంది. తన వద్ద మంత్రులందరికీ సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయని, అలాగే ఎప్పటికప్పుడు సర్వేల రిపోర్టులు కూడా తాను తెప్పించుకుంటున్నానని, తన ప్రోగ్రెస్ రిపోర్టును కూడా తెప్పించుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే త్వరలోనే అందరు మంత్రులకూ ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపేలా వ్యవహరిస్తేనే టీం వర్క్ చేసినట్లవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కటువుగానే వారికి నూతన ఏడాది హెచ్చరించినట్లు సమాచారం.
పనితీరు ఆధారంగా...
విపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా కేవలం కొందరు మాత్రమే సమాధానం ఇస్తుండటంతో పాటు మరికొందరు మంత్రులు తమకు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవి వచ్చింది కేవలం ఎవరికి వారు తమ నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం కోసం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ శాఖలపై పట్టును పెంచుకుని పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేలా ప్రయత్నాలు చేయాలని ఆయన హితబోధ చేసినట్లు తెలిసింది. టీం వర్క్ సక్రమంగా లేకపోతే అందరం నష్టపోతామని, అవసరమైతే ఈవిషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి మంత్రులను మార్చేందుకు కూడా వెనకాడబోనంటూ ఆయన సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు.