Revanth Reddy : బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మరోసారి ఫైర్ అయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోరి రెండుసార్లు కోరి కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. పదేళ్ల నుంచి నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని తెలిపారు. తాము వచ్చిన తర్వాత వరసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ఓటమి పాలయితే వారికి వెంటనే ఉద్యోగాలిచ్చిన కేసీఆర్ పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకుండా నియంతలాగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలు రావాలంటే కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌రావులను ఓడగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యారంగలో సంస్కరణలను...
ఎల్బీ స్టేడియంలో కొత్తగా నియమితులైన పదివేల మందికి పైగా టీచర్లకు నియామక పత్రాలను అందచేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి నిరుద్యోగులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. విద్యాశాఖలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడని, సలహాలు ఇవ్వరని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యత లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.