Revanth Reddy : వరంగల్ అభివృద్ధికి రేవంత సూచనలివే
హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెరిటేజి సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఈరోజు వరంగల్ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన హనుమకొండ కలెక్టరేట్ లో సమావేశమై వరంగల్ అభివృద్ధి పై పలు సూచనలు చేశారు. దీంతో పాటు వరంగల్ నగరానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన భూసేకరణ పనులను చేపట్టాలని ఆదేశించారు.
అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్డులకు...
భూసేకరణకు అవసరమయ్యే నిధుల వివరాలతో కూడిన అంచనాలను అందించాలని కోరారు. జాతీయ రహదారి నుంచి తిరిగి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యేలా అవుటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్‌టైల్ పార్క్ కు అనుసంధానించేలా రోడ్డు వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులన్నీ సత్వరం పూర్తి అయ్యేలా సమగ్ర ప్రణాళికలను, అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి అందచేయాలని కోరారు.