Revnanth Reddy : ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతాం
డీ లిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలు ఉనికిని కోల్పోయే ప్రమాదముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు;

డీ లిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలు ఉనికిని కోల్పోయే ప్రమాదముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది పార్లమెంటు సీట్లు పెరిగి దక్షిణాది సీట్లు తగ్గితే ఈ ప్రాంత ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోక తప్పదని అన్నారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ శాతం పన్ను చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటాను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అదే యూపీ, బీహార్ లు తక్కువ పన్ను చెల్లిస్తున్నా ఎక్కువ వాటా ఇస్తుందని, ఇది వివక్ష కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
డీలిమిటేషన్ జరిగితే...
ప్రస్తుతమున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకే ఈ ప్రక్రియను ప్రారంభించినట్లుందని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకించాలని రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో కోరారు. దీనిని అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ వ్యవహరించాలన్నారు. అప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.