SlBC Accident : టన్నెల్ లో మృతదేహాలు .. రేపు ఎండ్ కార్డు చెప్పేస్తారా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి నెల రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ మృతదేహాల ఆచూకీ మాత్రం లభించకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీశైలం టన్నెల్ ప్రమాదంపై సమీక్ష చేయనున్నారని తెలిసింది. ఆయన అధికారులతో సమీక్ష చేసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకనే అవకాశముంది. టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేదా? అన్న దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
నెలరోజులు దాటుతున్నా...
అయితే సహాయక చర్యలు చేపడుతున్నా, నెల రోజుల నుంచి అతీగతీ లేకపోవడంతో ఇంకెంత కాలం ఈ చర్యలు చేపడతామని సహాయక బృందాలు కూడా పెదవి విరుస్తున్నాయి. టన్నెల్ లో తప్పిపోయిన ఎనిమిది మందిలో కేవలం ఒక మృతదేహం మాత్రమే లభించడం, మిగిలినవి ఎంతగా శ్రమిస్తున్నా జాడ తెలియకపోవడంతో సహాయక బృందాల్లోనూ నిరాశ ఆవరించి ఉందని చెప్పాలి. సుదీర్ఘంగా నెల రోజుల నుంచి నిరంతరం శ్రమిస్తున్నా ఏడుగురు మృతదేహాల ఆచూకీ దొరకకపోవడంతో వారి నుంచి కూడా తమ ప్రయత్నాలు అన్నీ చేశామని, ఇక ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తుంది.
అన్ని రకాలుగా చర్యలు...
అన్ని రకాలుగా గాలింపు చర్యలు సహాయక బృందాలు చేపడుతున్నాయి. కేరళ నుంచి శునకాలను రప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో రోబోలను రప్పించారు. అయినా వాటివెలికి తీత సాధ్యం కావడంలేదు. దీనికి ఎండింగ్ ఎప్పుడన్నది వారికి అర్థం కావడం లేదు. చేయాల్సిన పనులన్నీ చేసినా ఫలితం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఇక దీనికి ముగింపు పలకాలా? వద్దా? అన్న మీమాసంలో ఉన్నతాధికారులు పడిపోయారు. బురద పేరుకుపోవడం, టీబీఎం శకలల తొలగింపు సాధ్యం కాకపోవడం, నీటి ఊట ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. రేపు టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగించాలా? వద్దా? అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో తేలనుంది.