Telangana : ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ నేతలు... ఇప్పట్లో సేఫ్ అని ఖుషీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చను లేవనెత్తాయి;

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చను లేవనెత్తాయి. నిజానికి ఏపీలో గత పదేళ్ల నుంచి కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను జైళ్లలో వేశారు. అలాగే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు వరసగా జైలు బాట పడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అనేక కేసులు నమోదవుతున్నా, అనేక కేసులపై విచారణ జరుగుతున్నా ఇప్పటి వరకూ అరెస్ట్ అనేది జరగలేదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా అనేక ఆరోపణలు చేశారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యలుపై అవినీతి విమర్శలు చేశారు.
అనేక కేసుల్లో...
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ నడుస్తుంది. అలాగే కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కమిషన్ విచారణ కొనసాగుతుంది. అదే సమయంలో ఫార్ములా వన్ కారు రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. కానీ వీటిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. తప్పించి రాజకీయ నేతలను ఇప్పటి వరకూ టచ్ చేయలేదు. ఇక కాళేశ్వరం పై ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చే నివేదిక వరకూ వెయిట్ చేయాల్సి ఉండటంతో దానిని పక్కన పెట్టారు. కానీ ఫార్ములా ఇ కారు రేసింగ్ వ్యవహారంలో మాత్రం ఎవరినీ ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. కేటీఆర్ లక్ష్యంగా ఆయన ఈ కేసు నమోదు చేశారని భావించారు.
కేటీఆర్ సిద్ధమయినా...
కేటీఆర్ కూడా తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ విచారణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ అరెస్ట్ లు జరగలేదు. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలేనని అంటున్నారు. అవి పూర్తయిన తర్వాత అరెస్ట్ లు జరిగే అవకాశముందని చెబుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తాను కక్షపూరిత రాజకీయాలకు దిగబోనని ప్రకటించడంతో ఫార్ములా ఈ రేసు కేసులో అరెస్ట్ లు ఉంటాయా? లేదా? అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అరెస్ట్ చేస్తే అనవసరంగా సానుభూతి ఏర్పడటమే కాకుండా తాము చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత లేకుండా పోతాయని భావించి రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఏ కేసులోనూ అరెస్ట్ అయి జైలుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.