Liquor Sales : మద్యం అంటే పడిచచ్చేది మనోళ్లేనట.. తాగినోళ్లు తాగినట్లుగానే తూలుతున్నారుగా?

మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది

Update: 2024-11-01 07:29 GMT

మద్యం అన్ని రకాల అనర్థదాయకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రతిరోజూ మద్యం తాగుతూ తులుతూ తమను తాము మర్చిపోయే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువయిపోయింది. ఫ్యాషన్ గా మారిపోయింది. యువత నుంచి వృద్ధుల వరకూ మద్యాన్ని తాగేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీకెండ్ లో అయితే చెప్పలేని పరిస్థితి. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. అందుకే మద్యం దుకాణాలు కూడా ప్రత్యేకించి ఆఫర్లు ప్రకటిస్తూ మందుబాబులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా మద్యం అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలే ముందున్నాయని ఒక సర్వే నివేదిక వెల్లడించింది.

తెలంగాణ మొదటి స్థానం...
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇక్కడ ఏ పండగ వచ్చినా ఇక మందుబాబుల జోరును ఆపలేం. సెలవు దినం వస్తే దావత్ కు రెడీ అవుతారు. శుభకార్యమైనా, కుటుంబంలో చెడు జరిగినా తెలంగాణలో మద్యం ఒక సంప్రదాయంగా మారడంతో ఇక్కడ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో మద్యం పై ఒక్కొక్కరు 1,623 రూపాయలు వెచ్చిస్తున్నారని సర్వేలో తేలింది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ఈ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో అత్యధికంగా మద్యాన్ని సేవించినట్లు ఈ సర్వేలో తేటతెల్లమయింది. దసరా పండగ సెలవు దినాల్లోనూ కోట్ల రూపాయల మద్యం సేవించి నట్లు ఎక్సైజ్ అధికారులు లెక్కలు చెప్పారు.
రెండోస్థానంలో ఏపీ...
ఇక రెండో స్థానంలో మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ కూడా జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కరు మద్యానికి 1,306 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమయింది. ముఖ్యంగా ఏపీలో మద్యం కొత్త పాలసీ వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అన్ని బ్రాండ్ల మద్యం దొరుకుతుండటంతో ఫుల్లు ఖుషీ అవుతున్నారు మందుబాబులు. దీంతో దేశంలోనే తెలంగాణ తర్వాత రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల్లో నిలిచింది. ఇక తర్వాత స్థానంలో పంజాబ్ ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు 1,245 రూపాయలు ఖర్చుచేస్తుండగా, నాలుగో స్థానంలో ఛత్తీస్‌ఘడ్ నిలిచింది. ఇక్కడ ఒక్కొక్కరు 1,227 రూపాయలు మద్యం కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడయింది. సో.. తాగి ఊగేవాళ్లలో మనోళ్లే దేశంలో టాప్.


Tags:    

Similar News