Telangana : ఏపీ తరహాలోనే పింఛన్లు.. త్వరలోనే పింఛనుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ తరహాలోనే పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయినట్లు తెలిసింది.
తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ తరహాలోనే పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయినట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై కసరత్తులు చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు అనేక గ్యారంటీలను అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా పింఛనుదారులకు అవసరమైన మొత్తాన్ని పెంచుతూ త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలిసింది. కులగణన సర్వే లో అనేక మంది పింఛను దారులు తమకు అందుతున్న మొత్తంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
అసంతృప్తి ఉండటంతో...
ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది. ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తుంది. 200 యూనిట్లలోపు ఉన్న వినియోగదారులకు విద్యుత్తు బిల్లు కూడా రద్దు చేస్తుంది. రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీని కూడా అమలు చేసింది. దీంతో పాటు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ లో ఉన్న ఆసరా పింఛన్ దారులతో పాటు దివ్యాంగులకు కూడా పింఛను మొత్తాన్ని పెంచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మొత్తాన్ని పెంచకపోవడంపై కూడా జనంలో కూడా పెద్దగా చర్చ జరుగుతుంది.
పొరుగు రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చెల్లిస్తుంది. పొరుగు రాష్ట్రంలో ఆ రకమైన పింఛను మొత్తాన్ని అమలు చేస్తుండటంతో తెలంగాణలో కూడా అమలు చేయకపోతే తమకు ఎన్నికల్లో రాజకీయంగా నష్టం తప్పదని భావించిన రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ అందుతున్న పింఛను దారులకు వీలయితే కొత్త ఏడాది నుంచి పెంచిన పింఛను మొత్తాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వృద్ధులు హ్యాపీగా ఉండటానికి అవసరమైన మొత్తాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.