Hyderabad : పాతబస్తీ వాసులకు తీపికబురు... కొత్త ఏడాదికి కూత ప్రారంభమవుతుందా?
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు పనులను వచ్చే జనవరి నెల నుంచి ప్రారంభించనున్నారు.;
హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా పాతబస్తీలో మెట్రో రైలు పనులను వచ్చే జనవరి నెల నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ మెట్రో రైలు సక్సెస్ అయిందనే చెప్పాలి. నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత కూడా మెట్రో రైళ్లలో ప్రయాణించే పురుషుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద మెట్రో రైలు వ్యవస్థగా హైదరాబాద్ అవతరించబోతుంది. త్వరలోనే మరో నాలుగు లైన్ల లో విస్తరణకు మెట్రో రైలు సంస్థ ఏర్పాట్లను ప్రారంభించింది.
త్వరగా గమ్యస్థానానికి...
మెట్రో రైలుతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు ట్రాఫిక్ లో చిక్కుకోవడం వంటి సమస్యల నుంచి హైదరాబాద్ నగర వాసి బయటపడతాడు. అందుకే మెట్రో వినియోగం హైదరాబాద్ లో ఎక్కువయింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నుంచి సామాన్యుల వరకూ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. కొందరు మహిళలు ఎక్కువగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎగువ తరగతి, ఎగువ మధ్యతరగతి మహిళలు మాత్రం మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో్ సోమవారం నుంచి ఆదివారం వరకూ మెట్రో రైళ్లలో రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రతి మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉండటంతో పెద్దగా వెయిట్ చేసే అవసరం కూడా లేదు.
అత్యధిక శాతం ఆక్యుపెన్సీ రేటు...
సీటు దొరకకపోయినా కాసేపు నిల్చుంటే చాలు వెంటనే తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీనిపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలో మొదటి పి పి పి మోడల్ మెట్రో రైల్ హైదరాబాద్ లో ఉందన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పి పి పి మోడ్ లో కట్టారని, కానీ అది కూడా అక్కడ ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ హైదరాబాద్ లో మెట్రో సక్సెస్ అవ్వడానికి అనేక కారణాలున్నాయని ఆయన వివరించారు. ఫస్ట్ ఫేజ్ లో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలను ప్రవేశపెట్టగా 57 స్టేషన్లున్నాయన్న మెట్రో ఎండీ ఇందుకోసం 22,148 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీ నాటికి 5.63 లక్షల ప్రయాణికులు మరియు 7.43 లక్షల ట్రిప్పులను వేసినట్లు ఆయన తెలిపారు.
ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ...
మన మెట్రో రైలు గురించి స్టాన్ఫార్డ్ యూనివర్శిటీ లో కేస్ స్టడీ గా ఉందన్న ఆయన అయితే ఆపరేషనల్ నెట్వర్క్ లో హైదారాబాద్ మూడో స్థానానికి పడిపోయిందన్నారు. ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే తొమ్మిదో స్థానానికి పడిపోతామని తెలిపారు. దీనిపై వరస సమీక్షలు చేస్తున్నామనిచెప్పిన ఎన్వీఎస్ రెడ్డి ట్రాఫిక్ మరియు ట్రాన్స్ పోర్టేషన్ సర్వేను సిస్త్రా కన్సల్టేషన్ చేపట్టిందని చెప్పార. ఆరో ఫేస్ లో రెండు కారిడార్ లలో 116.4 కిలోమీటర్ల వరకూ పనులు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకూ ఐదు ఫేజ్ లకు సంబంధించి 76.4 కిలో మీటర్లకు డీపీఆర్ ను సిస్ట్రా కన్సల్టేషన్ పూర్తి చేసిందన్నారు.మియాపూర్ నుంచి పఠాన్ చెరు, నాగోల్ నుండి విమానాశ్రయం, ఎల్ బి నగర్ నుంచి హయత్ నగర్, రాయదుర్గం నుండి కోకాపేట్ నియో పోలీస్ వరకు విస్తరణ ఉంటుందన్న ఆయన చాంద్రాయణ గుట్ట మెట్రో జంక్షన్ అవుతుందన్నారు. విమానాశ్రయం రూట్ లో 24 స్టేషన్ లకు ప్లాన్ చేశామన్న మెట్రో ఎండీ నాగోల్ నుండి విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్ల ప్రయానం ఉంటుందని తెలిపారు. ఫలకునుమా నుండి రెండు కిలో మీటర్ల మేర పెంచి చాంద్రాయణ గుట్ట వరకు పొడగిస్తామని తెలిపారు. మియాపూర్ నుండి పఠాన్ చేరు వరకు 13.4 కి.మీ లలో కారిడార్ ఏడు వస్తుందని, ఇందులో 10 స్టేషన్ లు వస్తాయన్నారు. ఈ కారిడార్ లో డబుల్ డెక్కర్ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లున్నాయని, ఇందులో 6 స్టేషన్ లు ఉన్నాయని, ఇది కారిడార్ ఎనిమిదో లో వస్తుందని చెప్పారు. విమానాశ్రయం రూట్ లో 1.6 కిమి మాత్రమే అండర్ గ్రౌండ్ వస్తుందని చెప్పారు. పాతబస్తీలో జనవరి నెల నుంచిపనులు ప్రారంభిస్తామని,అక్కడ మొత్తం పదకొండు వందల ఆస్తులను సేకరించామని ఆయన తెలిపారు. మొత్తం మీద హైదరాబాద్ పాతబస్తీ వాసుల మెట్రో కల త్వరలోనే నెరవేరనుంది.