Telangana : తెలంగాణలో చంపేస్తున్న చలి.. ఇంకెన్ని రోజులో?
తెలంగాణలో చలీ తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఉదయం పన్నెండు గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు
తెలంగాణలో చలీ తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఉదయం పన్నెండు గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం నుంచి విధులకు బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇన్నాళ్లు స్వెటర్ల వాడకం లేని హైదరాబాదీలు కూడా పాత వాటిని బయటకు తీసి ధరించాల్సి వస్తుంది. మంకీ క్యాప్ లను కూడా పెట్టుకోవాల్సి ఉంది. ఉదయం పన్నెండు గంటల వరకూ చలి తీవ్రత తగ్గకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చిరు వ్యాపారులు సయితం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కానీ దుకాణలు తెరవడం లేదు.
బయటకు రావాలంటేనే...
హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. చలికి చేతులు గజగజ వణుకుతున్నాయి. గడ్డకట్టుకుపోతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలపై వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఎక్కువ మంది మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో అవి రద్దీగా మారిపోయాయి. మరోవైపు చలి తీవ్రతకు అనేక రకాల వ్యాధులు సంక్రమించి ఆసుపత్రుల పాలవుతున్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉస్మానియా, నిలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెరుగుతూ ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సింగిల్ డిజిట్ కు...
అదే సమయంలో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 9.3, న్యాల్కల్ 9.6, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ర్టంలో నే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.4 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయిందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల లో 8.9డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయింది.