"అతనిపై పోటీ అంటే..మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే" : కవిత

ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి..

Update: 2023-05-30 12:30 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ సీఎం ప్రజల కోసం చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందించారని ఆమె తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్రమంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో అద్భుతంగా పనిచేస్తున్నారంటూ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గతంలో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆర్మూర్ లో ఎవరైనా పోటీ చేయాలనుకుంటే.. "అతనిపై పోటీ అంటే..మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే" అని కవిత అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీ నేతలు ఆర్మూర్ లో పోటీచేసి గెలిచే ఛాన్స్ లేదని జోస్యం చెప్పారు. ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. “మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతీ పథకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేధం... చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం.. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండలాగా తరతరలాకు ఆదుకునే ప్రాజెక్టు. మనది ఉట్టి రాజకీయ పార్టీ కాదు. ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో , ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ మనది ” అని కార్యకర్తలను ఉద్ధేశించి కవిత మాట్లాడారు.
తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని..అది కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్పూర్తిని తీసుకకొని ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, ఇలాంటి పార్టీలో ప్రతీ ఒక్కరికి అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. లక్షా 33 వేల మంది బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే నిజామాబాద్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.


Tags:    

Similar News