ముగిసిన కవిత విచారణ.. తిరిగి 16న విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 8 గంటల పాటు విచారణ జరిపారు;

Update: 2023-03-11 14:39 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆమెను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారణ జరిపారు. ఈ నెల పదహారోతేదీన తిరిగి విచారణకు రావాలని ఈడీ అధికారులు కోరినట్లు తెలిసింది.  ఉదయం పదకొండు గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవితను నలుగురు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దయెత్తున వేచి ఉన్నారు. కవిత విచారణ జరుగుతున్నంత సేపు వారు ఈడీ కార్యాలయం వద్దనే ఉన్నారు. రామచంద్ర పిళ్లై తో కలిపి కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ కార్యాలయం నుంచి నేరుగా కల్వకుంట్ల కవిత తన ఇంటికి వెళ్లిపోయారు.

అందరూ అక్కడే...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు కవిత ఈడీ విచారణ సందర్భంగా ఢిల్లీ చేరుకున్నారు. తొలిరోజు విచారణను ముగించి కవితను బయటకు పంపుతారని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. మరోసారి కవితను విచారణకు పిలుస్తారా? రేపు విచారణకు రమ్మన్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు పంపుతున్నారు.


Tags:    

Similar News