KTR : లొట్ట పీసు కేసులేనా? కేటీఆర్ ను వదిలేలా లేరే... వరస కేసులతో ఇక అంతేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరసగా ఫిర్యాదులు అందుతున్నాయి;

Update: 2025-01-08 08:07 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయన పదేళ్ల కాలంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారని అందరికీ తెలిసిందే. పేరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఎక్కువగా నిర్ణయాలు కేటీఆర్ తీసుకునే వారు అని అందరూ ఒప్పుకునే విషయమే. కేసీఆర్ ప్రగతి భవన్ బయటకు రారు. సచివాలయానికి కూడా ఆయన రాక అరుదుగా ఉండేది. అందుకే కేటీఆర్ పైనే ఎక్కువ మంది ఆధారపడే వారు. ఆయన చెప్పినట్లుగానే అధికారులు సయితం నిర్ణయం తీసుకునేవారు. ఇది అందరికీ తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సయితం కేటీఆర్ ఆదేశాల ప్రకారం నడుచుకునే వారు. ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్ అయ్యేది.

షాడో సీఎంగా...
ఒకరకంగా చెప్పాలంటే కేటీఆర్ షాడో సీఎంగా చెలాయించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కూడా క్విడ్ ప్రోకో జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఏసీబీ ఈ మేరకు కేసు నమోదు చేసింది. రేపు విచారణకు వెళ్లాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా ఈ కారు రేసు వ్యవహారంలో నిబంధనలకు విరుద్దంగా ఈఎఫ్ఓకు నిధులు బదలాయింపు.. అగ్రిమెంట్‌కు ముందే నిధులు చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఏసీబీ ఆరోపిస్తుంది. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు.
వరస కేసులతో...
ఈకేసు నడుస్తుండగానే తాజాగా అవినీతి నిరోధక శాఖకు మరో ఫిర్యాదు అందింది. అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాణలపై అవినీతి జరిగిందని బీసీ నేత యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఓఆర్ ఆర్ టెండర్లలో 7,380 కోట్ల మేరకు అవినీతి జరిగిందంటూ అందిన ఫిర్యాదు కూడా కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటివరకూ ఏసీబీకి ఫిర్యాదు మాత్రమే అందింది. కేసు ఇంకా నమోదు చేయలేదు. ఇంత పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం జరిగాయన్న ఫిర్యాదు అందడంతో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో కేటీఆర్ పై వరస కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దీంతో పాటు మరికొందరు కూడా కేటీఆర్ పై ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ లో జరిగిన అవీనీతిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News