Raithu Bharosa : వారెవ్వా.. ఇంత వెసులుబాటు ఇచ్చేశారా.. రైతు భరోసా నిధులు వారికి కూడానా?
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.;
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు వర్తిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు కాకుండా, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఉపయోగించిన భూమిని మినహాయించి మిగిలిన అన్ని భూములకు ఈ రైతు భరోసాను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి రైతు ఖాతాలో పన్నెండు వేల రూపాయలు దీంతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
లబ్దిదారుల ఎంపికను...
ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ వ్యవసాయ యోగ్యమైన భూముల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే లబ్దిదారుల వివరాలను కూడా నోట్ చేసుకుంటున్నారు. కానీ పంట భూముల్లో వేయకపోయినా ఆ భూమి వ్యవసాయ యోగ్యమైనదిగా ఉంటే చాలు దానికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. పంట ఎప్పుడు వేశారన్నది కాకుండా.. ఎప్పుడైనా పంట వేసుకునే అవకాశం ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా నిధులను ఆ యా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జనవరి 26వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో విడతల వారీగా ఈ నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అరవై లక్షల మంది వరకూ...
ఈ పథకం కింద దాదాపు అరవై లక్షల మంది రైతుల వరకూ లబ్ది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నాటికి లబ్దిదారుల జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. తొలి విడతగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చెల్లించనున్నారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలలకు కూడా రెండు విడతలుగా నగదు చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసంఇప్పటికే నిధులను కూడా సిద్ధం చేశారు. ఒక్క వ్యవసాయ కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసాకు 700 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసి ఈ మేరకు నిధులను సిద్ధం చేసి పెట్టింది. రైతు భరోసాకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది.