టెర్రర్ టెన్షన్.. పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్‌కి బాంబులు.! అసలు ప్లానేంటి?

పాకిస్తాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కి పేలుడు పదార్థాలు తరలిస్తూ నలుగురు దుండగులు హర్యానాలో అరెస్టయ్యారు.

Update: 2022-05-05 12:27 GMT

దేశంలో ఒక్కసారిగా బాంబుల కలకలం రేగింది. పాకిస్తాన్ నుంచి తెలంగాణకు బాంబులు తరలించేందుకు ప్రయత్నిస్తూ నలుగురు వ్యక్తులు అరెస్టు కావడం అలజడి రేపుతోంది. హర్యానాలోని కర్నాల్ జిల్లా బస్తారా టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో ఓ ఇన్నోవా కారులో మూడు ఐఈడీ బాంబులు, ఒక పిస్టల్, 30 లైవ్ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. కారులో పెద్దఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టైన నలుగురిలో ముగ్గురు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కి చెందిన వారు కాగా.. ఒకరు లుధియానాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్టు ఐబీ సమాచారం అందించడంతో హర్యానా పోలీసులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున బస్తారా టోల్‌ప్లాజా వద్ద నిఘా పెట్టారు. వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో బాంబులు, పేలుడు పదార్థాలు గుర్తించిన పోలీసులు కారులోని గురుప్రీత్, పర్మీందర్, అమన్‌దీప్, భూపేంద్రను అరెస్టు చేశారు. వారిని నిషేధిత ఖలిస్థాన్ తీవ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

నిందితుడు గురుప్రీత్ పాకిస్తాన్‌‌కి చెందిన వ్యక్తితో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాంబులు, పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లో ఫిరోజ్‌పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు దాటించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని తెలంగాణలోని ఆదిలాబాద్ చేర్చాలని వారికి ఆదేశాలున్నట్లు చెబుతున్నారు. గతంలోనూ మహారాష్ట్రలోని నాందేడ్‌కి ఆయుధాలను సరఫరా చేసినట్లు తెలిసిందని కర్నాల్ ఎస్పీ తెలిపారు. అయితే తెలంగాణకు పాకిస్తాన్ బాంబులు తరలిస్తూ ఉగ్రవాదులు అరెస్టయ్యారని తెలియడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అక్కడి నుంచి తెలంగాణకు పేలుడు పదార్థాలు పంపడం వెనక ఉన్న కుట్ర ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News