Revanth Reddy : రేవంత్ సర్కార్ సంక్షేమాన్ని పీక్ కు తీసుకెళ్లనున్నారా? మరో తీపికబురు రెడీ అయిందా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. త్వరలోనే మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది

Update: 2024-12-02 07:03 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. తాజాగా నిన్న రైతు భరోసా నిధులను కూడా సంక్రాంతికి జమ చేస్తామని రైతులకు శుభవార్త రేవంత్ రెడ్డి చెప్పారు. విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో ఇక రానున్న కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో ఇక గ్యారంటీలను అమలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళుతూ ప్రజలను మరింతగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమానికి ధీటుగానే తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్న బలమైన సంకేతాలను పంపాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.

ఆదాయ వనరుల సమీకరణకు...
అందుకోసం ఆదాయ వనరుల సమీకరణ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మద్యం ధరలను పెంచడం కూడా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో భాగమేనంటున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకానికి కూడా త్వరలో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులను మంచి చేసుకుంటున్నారు. మరో వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల కు రెండు లక్షల రుణమాఫీ చేశారు. వరి ధాన్యంపై ఐదు వందల రూపాయల బోనస్ ను కూడా అమలు చేస్తున్నారు. తాజాగా రైతుభరోసా నిధులను కూడా సంక్రాంతి నుంచి విడుదల చేయనున్నారు.
వరసగా హామీలు నెరవేర్చుకుంటూ...
దీంతో రైతులకు ఇచ్చిన హామీలు దాదాపు నెరవేరినట్లే. ఇక మహిళల విషయానికి వస్తే ఇప్పటికే మహిళలకు తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తుంది. నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల భారం అయినా ఏడాది నుంచి అమలు చేస్తుంది. ఇక రెండు వందల యూనిట్లలోపు వినియోగించిన వారికి ఉచిత విద్యుత్తుతో పాటు, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. తాజాగా ఇక నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన గ్యారంటీని కూడా త్వరలో అమలు చేయనున్నారని తెలిసింది. అయితే రేషన్ కార్డులు ఆధారంగానే పథకం అమలు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డులతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకే ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.
విధివిధానాల ఖరారుకు...
ఈ పథకం విధివిధానాలను త్వరలోనే ఖరారు చే్స్తారని సమాచారం. ఎంతమంది మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది? నెలకు ఎంత మేరకు నిధులు అవసరమవుతాయో? తెలపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ పథకం అమలుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ పథకం అమలు చేస్తే మహిళ ఓటర్లు గంపగుత్తగా తమకు అనుకూలంగా మారతారని అంచనా వేస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టు పోకుండా కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డికి ప్రతి ఎన్నిక ఒక సవాల్ గా మారనుంది. అందుకే సంక్షేమ పథకాలతో ప్రజలను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తున్నారు. మరి రేవంత్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది చూడాలి.


Tags:    

Similar News