Acb Raid : మామూలోడు కాదండీ.. పదేళ్లలోనే ఇన్ని ఆస్తులా? కోట్లకు పడగెత్తిందిలా
ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఆస్తులను చూసిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు;
ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఆస్తులను చూసిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ఆశ్చర్యపోయారు. చిన్న వయసులో ఉద్యోగం సంపాదించుకున్న నిఖేశ్ కుమార్ అక్రమాస్తులను కేవలం పదేళ్లలోనే కూడబెట్టడంపై నోరెళ్లపెడుతున్నారు. అంటే రోజుకు ఎంత ఆదాయం సంపాదించాడన్న చర్చ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులే చేసుకుంటున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు కూడా ఇది సాధ్యపడని విషయం. అలాంటిది ఇరిగేషన్ శాఖలో ఒక ఏఈఈగా ఉంటున్న నిఖేశ్ కుమార్ ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారంటే చేతివాటం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కనిపించిన ప్రతి చోటా అడ్డంగా దోచుకుంటేనే ఈ స్థాయి ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. నీటి పారుదల శాఖ లో అవినీతి చేప చిక్కినట్లయింది.
హిస్టరీలో అతి పెద్ద ఆపరేషన్ గా...
నిఖేశ్ కుమార్ 2013లో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం చేరారు. అయితే ఇప్పుడు ఆయన ఆస్తులను చూస్తే ఆరు వందల కోట్ల రూపాయలు దాటిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన హిస్టరీలో ఇది అతి పెద్ద ఆపరేషన్ గా వారు భావిస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన నిఖేశ్ కుమార్ విల్లాలు, ఇళ్లు, స్థలాలు, బంగారం, వెండి చూసి ఏసీబీ అధికారులు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఈరోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో రేపు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచే అవకాశముంది. లాకర్లలో ఇంకెంత ఆస్తులుంటయోయనని అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
గుర్తించిన ఆస్తులివే...
నిఖేశ్ కుమార్ కు నానక్‌రాంగూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో విల్లాలున్నట్లు గుర్తించారు. నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం ఉన్నట్లు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లున్నాయి. తాండూరులో మూడు ఎకరాలు ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు తేల్చారు. కిలోల కొద్ది బంగారాన్ని నిఖేష్ బంధువుల ఇళ్లలో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు జిగేల్ మనిపించాయి. ఇంకా బినామీ ఆస్తులు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రేపు నిఖేష్ కుమార్ లాకర్లతో పాటు బంధువులకు చెందిన లాకర్లను తెరిస్తే ఇంకెంత ఆస్తులు బయటపడతాయో? నని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఏఈఈ ఇంత అక్రమార్జనకు పాల్పడితే ఆయన వెనక ఉన్న అధికారులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.