Revanth Reddy : రైతులారా.. బీఆర్ఎస్ నేతల ఉచ్చులో పడకండి
రైతులకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని, మరే ప్రభుత్వం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు;
బీఆర్ఎస్ నేతల ఉచ్చులో రైతులు పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారి మాటలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. మహబూబ్ నగర్ లో రైతు పండగ ముగింపు ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. గత ఏడాది నవంబరు 30న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. నాడు పాలమూరు బిడ్డల కన్నీళ్లను దగ్గర నుంచి చూశానని చెప్పారు. రైతుల కష్టాలు ఏంటో తనకు తెలియంది కాదన్నారు. తనకు ఈ అవకాశం ఆషామాషీగా వచ్చింది కాదని, ఇది తాను బాధ్యతగా చూస్తానని తెలిపారు. నవంబరు 30వ తేదీన ప్రాధాన్యం ఉన్న రోజు అని ఆయన తెలిపారు. తాను మంత్రిగా కూడా పనిచేయకపోయినా ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించారన్నారు. మీ అండతోనే ఇంతటి పెద్ద పదవి లభించిందన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలన చేస్తే ఏం చేశారో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. కనీసం రైతు రుణమాఫీ కూడా చేయలేదని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించలేదన్నారు. నాడు వరేస్తే ఉరి అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కానీ నేడు వరి వేసుకుంటే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టానని చెప్పినా రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే మాత్రం తప్ప ఒక్కరికైనా ప్రయోజనం చేకూరిందా? అని ప్రశ్నించారు.