జగన్ "కార్డు" కరెక్ట్ గా కొడితే.. లెక్కలు మారతాయ్
2024 ఎన్నికలు జగన్ కు సవాల్ అని చెప్పక తప్పదు. ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత జగన్ కు నిజంగా ఓటు వేసే ఎన్నిక ఇది
2024 ఎన్నికలు జగన్ కు సవాల్ అని చెప్పక తప్పదు. ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత జగన్ కు నిజంగా ఓటు వేసే ఎన్నిక ఇది. ఎటువంటి సానుభూతి ఈసారి ఎన్నికల్లో పనిచేయదు. అలాగే ఇంకో ఛాన్స్ అనడానికి లేదు. కేవలం పరిపాలనను బేరీజు వేసుకుని మాత్రమే ఈసారి ఓటింగ్ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కులాల జాఢ్యం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా కులాల వారీగా విడిపోయి మరి పార్టీలకు అండగా నిలబడే సంప్రదాయం ఉంది.
కులాల వారీగా...
పాలనతో సంబంధం లేదు. అభివృద్ధి అవసరం లేదు. అవతలి కులం ఎవరికి మద్దతిస్తే, తాము మరొకరికి సపోర్టు చేయడమే ఏపీ ఎన్నికలలో జరుగుతుంది. గత ఎన్నికల్లోనూ జగన్ కు అన్ని కులాలు అండగా నిలిచాయి. తన సొంత సామాజికవర్గంతో పాటు దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు జగన్ కు అండగా నిలిచారు. అలాగే కాపు సామాజికవర్గంలోనూ మెజారిటీ ఓటర్లు జగన్ కు మద్దతు తెలిపారు. బీసీలయితే జగన్ కు తొలిసారి టీడీపీని కాదని మద్దతిచ్చారు. ఫలితంగానే జగన్ పార్టీకి గత ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చాయి. విపక్షాలు పూర్తిగా దెబ్బయి పోవడానికి కులాల లెక్కలే కారణమని చెప్పకతప్పదు.
గత ఎన్నికల్లో.....
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీ తెలుగుదేశానికి నలభై శాతం, జనసేనకు 7 శాతం, వైసీపీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో నష్టపోయామని, ఈసారి ఎన్నికల్లో పొత్తులతో జగన్ ను కట్టడి చేస్తామని విపక్షాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు ఓసీల్లో ఆయన సొంత సామాజికవర్గంతో పాటు బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గం మద్దతిచ్చే అవకాశముంది. పవన్ తో కలిస్తే ఈసారి కాపులు ఈ కూటమికే మద్దతు తెలుపుతారు. అందువల్లనే జగన్ లెక్కలు వేసుకుని ఏపీలో అత్యధికంగా ఉన్న బీసీలను మరింతగా తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీసీలను మరింతగా....
ముందుగానే ఊహించిన జగన్ అధికారంలోకి రాగానే బీసీలపై ఫోకస్ పెంచారు. 139 బీసీ కులాలు ఉంటే 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. పదవుల పంపిణీలు, నామినేటెడ్ పనుల్లోనూ బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వీటిని వివరించి వారిని మరింత దగ్గరకు చేర్చుకునేందుకు బీసీ ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహిస్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు గుర్తింపు లభించిందన్న నినాదంతో ఈ సదస్సులు ఏర్పాటు కానున్నాయి. కాపులు దూరమయినా బీసీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం జగన్ పార్టీ మొదలు పెట్టింది. మరి ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.