కోమటిరెడ్డిపై చర్యలు తప్పవా..?

Update: 2018-09-24 12:49 GMT

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేలా కనపడుతోంది. పార్టీ ఎన్నికల కమిటీల నియామకంపై రాజగోపాల్ రెడ్డి ఇటీవల కార్యకర్తల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ ఇంఛార్జి కుంతియాను శనితో పోల్చారు. కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారని విమర్శించారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇవాళ షోకాజ్ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలని వ్యాఖ్యలు చేయలేదని, కేవలం పార్టీ కోసం ఆవేదనతోనే చేశానని వివరణ ఇచ్చారు.

మళ్లీ షోకాజ్ నోటీసులు

సోమవారం కోదండరెడ్డి అధ్యక్షతన పీసీసీ క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ లో మరోసారి భేటీ అయ్యి రాజగోపాల్ రెడ్డి అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆయన ఇచ్చిన వివరణకు కమిటీ సంతృప్తి చెందలేదు. పైగా షోకాజ్ ఇచ్చాక ప్రత్యేకంగా విలేకరుల సమావేశం సైతం ఏర్పాటు చేసి ఇటువంటి వ్యాఖ్యలే చేయడాన్ని మరింత సీరియస్ గా తీసుకుంది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మరో నోటీసు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పింది. అయితే, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు కామన్. ఒకసారి షోకాజ్ ఇచ్చి వివరణ కోరి సంతృప్తి చెంది ఊరుకుంటారు. అలా కాకుండా మళ్లీ షోకాజ్ ఇవ్వడం చూస్తే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Similar News