BIG BREAKING : నందమూరి తారకరత్న కన్నుమూత

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు (ఫిబ్రవరి 18) మరింత విషమించిందని వైద్యులు..

Update: 2023-02-18 16:38 GMT

ప్రముఖ హీరో, టీడీపీ నేత నందమూరి తారకరత్న(39) బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు (ఫిబ్రవరి 18) మరింత విషమించిందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్సకు సహకరించడం లేదన్న వైద్యులు.. ఆ కొద్దిసేపటికే తారకరత్న కన్నుమూసినట్లు తెలిపారు. తారకరత్న మరణవార్తలో నందమూరి అభిమానులు ఖంగుతిన్నారు. తమ ప్రియతమ నేత కోలుకుని తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్నవారికి ఎదురు చూపులే మిగిలాయి. మహాశివరాత్రి నాడు.. ఆ శివుడిలో ఐక్యం అయ్యారు. అతిచిన్న వయసులో తారకరత్న గుండెపోటుతో మరణించడం అందరినీ కలచివేస్తోంది.

మరో హృదయ విదారక విషయం ఏమిటంటే ఆయన పుట్టింది కూడా ఫిబ్రవరి నెలలోనే. 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయనకు భార్య అలేఖ్య, కూతురు ఉన్నారు. అలేఖ్య ఎంపీ విజయసాయి రెడ్డికి స్వయానా మరదలి కూతురు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. కాగా.. 23 రోజుల క్రితం కుప్పంలో నారాలోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్న విషయం తెలిసిందే. లోకేష్ తో కలిసి నడుస్తూ.. ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే టీడీపీ నేతలు, బాలకృష్ణ హుటాహుటిన కుప్పం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు.

తొలుత తారకరత్న పల్స్ పూర్తిగా పడిపోగా.. కుప్పం వైద్యులు సీపీఆర్ చేసి పల్స్ తెప్పించారు. ఆయన గుండెపోటుకు గురయ్యారని, హార్ట్ లో ప్రాబ్లమ్ ఉందని చెప్పడంతో.. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేర్పించారు. అప్పటి నుంచి తారకరత్న అక్కడే చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల తర్వాత ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక వైద్యం అందించేందుకు విదేశీ వైద్యులనూ పిలిపించారు. కానీ.. ఇంతలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ రోజు సాయంత్రానికి నందమూరి కుటుంబ సభ్యులంతా నారాయణ హృదయాలయకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తారకరత్న కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.


Tags:    

Similar News