నో టిక్కెట్.. వైసీపీ హైకమాండ్ నిర్ణయం

దాదాపు మూడేళ్ల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది.

Update: 2022-03-17 04:25 GMT

వ్యాపారాల నుంచి రాజకీయాలకు రావచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారాలే ముఖ్యమనుకుంటే భవిష్యత్ ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలపై స్పందిస్తేనే రాజకీయాల్లో మనగలుగుతారు. లేకుంటే టిక్కెట్లు ఇచ్చిన పార్టీలు సయితం మొహం మీదనే తలుపులు వేస్తాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. దాదాపు మూడేళ్ల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది.

కాంట్రాక్టర్ నుంచి...
ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ 1 కాంట్రాక్టర్. ఆయన ఎన్నో పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకుని లబ్ది పొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉండి బాగానే లబ్ది పొందారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ కేటాయించినా దానిని కాదని వైసీపీలో చేరి నెల్లూరు పార్లమెంటు సభ్యుడయ్యారు. అయితే గత మూడేళ్ల నుంచి పార్టీకి, ప్రజలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమయ్యారన్న విమర్శలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలతో....
తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా ఆయన పర్యటించడం లేదు. అక్కడి ఎమ్మెల్యేలకు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. వైసీపీలో ఆయన ఇమడలేక పోతున్నారని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
వచ్చే ఎన్నికలలో....
వైసీపీ హైకమాండ్ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని దూరం పెట్టిందనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో ఆదాలను మార్చాలన్న నిర్ణయానికి వచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ హైకమాండ్ ఉందని తెలిసింది. ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా ప్రజలకు దూరంగా ఉండటానికి ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయంలో ఈసారి జగన్ కఠిన నిర్ణయమే తీసుకోనున్నారని సమాచారం.


Tags:    

Similar News