టిక్కెట్ లేకుండానే జగన్ సినిమా చూపించాడా?
జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి ఫుల్లు ఖుషీ అయినట్లే కన్పిస్తుంది. జగన్ ను చిరంజీవి తన సోదరుడిగా అభివర్ణించారు
జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి ఫుల్లు ఖుషీ అయినట్లే కన్పిస్తుంది. జగన్ ను చిరంజీవి తన సోదరుడిగా అభివర్ణించారు. పండగ పూట తనను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆప్యాయతతో వడ్డించారని మురిసి పోయారు. సో.. చిరంజీవి జగన్ చూపిన ఆతిధ్యానికి ఫిదా అయ్యారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ అందరి వాడని చెప్పే ప్రయత్నం చేశారు. అందరి సాధక బాధకాలు ఆయన వింటారని, సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రాజకీయంగా...
సినిమా పరిశ్రమ సంగతి పక్కన పెడితే జగన్ మాత్రం రాజకీయంగా సక్సెస్ అయినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల ధరలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పై ఆయన మాటల దాడికి దిగారు. కానీ జగన్ పవన్ కల్యాణ్ కు నేరుగా సమాధానం చెప్పకుండా సోదరుడు చిరంజీవితోనే చెప్పారు. ఇంకెవరూ చిత్ర పరిశ్రమ నుంచి మాట జారవద్దని చెప్పడం కూడా అందులో భాగమేనని పిస్తుంది.
చిరంజీవి చేతనే....
చిరంజీవి సినిమా పరిశ్రమ కష్టాల కోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలసి ఉండవచ్చు. ఆయనకు అంతకు మించి వేరే ఆలోచనలు ఉండవు. చిరంజీవికి రాజకీయాల గురించి ఆలోచించే సమయమూ, శక్తి కూడా లేదు. కానీ జగన్ మాత్రం చిరంజీవిని నేరుగా తన వద్దకు పిలిపించుకుని, ఆయననోటితోనే తానేమిటో చెప్పించుకుని, తన వ్యతిరేకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారన్నది వాస్తవం. ఏతావాతా చూస్తే ప్రత్యర్ధులకు జగన్ టిక్కెట్ లేకుండానే సినిమా చూపించాడన్నమాట.