ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉంది. కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం, గంటగంటకూ వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. నీరుకొండ వద్ద రాజధాని భూములకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాయపూడిలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కోటేళ్ల వాగు కూడా పొంగి ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు - సచివాలయం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. మళ్లీ వర్షం కురిస్తే గ్రామంలోకి నీరు పోటెత్తే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.