Fengal Cyclone : నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. రేపు తుపానుగా మారే అవకాశం

ఫెంగల్ తుపాను విషయంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది;

Update: 2024-11-28 06:03 GMT

ఫెంగల్ తుపాను విషయంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతుందని తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు రెండు కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కిలో మీటర్లు, నాగపట్నానానికి 310 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 410 కిలో మీటర్లు, చెన్నైకి 480 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల పెన్నుండు గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

మూడు రోజుల పాటు...
శుక్రవారం ఉదయానికి తీవ్ర వాయుగుండం తుపాను గా మారే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో మూడు రోజులు అంటే ఈరోజు నుంచి ఎల్లుండి వరకూ దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఇక రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈదురుగాలులతో కూడిన...
మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అప్ డేట్ లో తెలిపింది. సాయంత్రానికి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.







Tags:    

Similar News