Cyclone Alert : ఎడతెరిపి లేని వర్షాలు.. సముద్రం అల్లకల్లోలం.. ఏపీకి ఎంత ఎఫెక్ట్ అంటే?

ఫెంగల్ తుపాను ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-11-28 03:49 GMT

ఫెంగల్ తుపాను ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడని వాయుగుండం తుపానుగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు హై అలెర్ట్ ను ప్రకటించింది. ఫెంగల్ తుపాను రెండు ోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకుతుందన్న అంచనాలు కూడా వినపడుతన్నాయి. మరోవైపు తమిళనాడులోనూ తుపాను తీరం దాటే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగి పేట్టె, చెన్నై మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

ఈ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్...
ఫెంగల్ తుపాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పింది. దీంతో పాటు పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం నుంచి శనివారం వరకూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు తీరం వెంట 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. సముద్రం అలజడిగా ఉంటున్నందున దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.
కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి...
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హెల్ప్ లైన్లతో పాటు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలో ఉండే వారిని అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు దాటకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా భారీ వర్షాలకు ప్రమాదం సంభవిస్తే వెంటనే తమకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారిని అప్రమత్తం చేస్తుంది. రైతులు తమ పంట ఉత్పత్తులు వర్షం పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచించింది. వర్ష తీవ్రతను బట్టి ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News