Tirumala : తుపాను ఎఫెక్ట్.. నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనపడుతుంది.;

Update: 2024-11-28 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే కనపడుతుంది. దీనికి తోడు తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల రాక తిరుమలకు తగ్గింది. అందుకే కంపార్ట్ మెంట్లలో పెద్దగా భక్తులు లేరు. స్వామి వారి దర్శనం కూడా సులువుగానే పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ లోనూ అందులోనూ చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో భక్తుల రాక తిరుమలకు తగ్గిందని అఢికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తుపాను ప్రభావం రేపటి నుంచి ఏపీలోని మూడు జిల్లాల్లో అత్యధికంగా ఉండే అవకాశమున్నందున భక్తులు తమ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మూడు కంపార్ట్ మెంట్లలోనే...
కాకుంటే ముందుగానే ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రం తిరుమలకు చేరుకుని ఏడుకొండలవాడికి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. తిరుమలలో కూడా తుపాను ప్రభావంతో భారీ వర్షంప పడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,626 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,231 మందిభక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News