ఆనం రామనారాయణరెడ్డి నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆనం వైసీపీ కండువాను జగన్ సమక్షంలో చేరనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి దాదాపు పది నెలలు కావస్తుంది. పది నెలల నుంచి జగన్ జనంలోనే ఉంటున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఇప్పటికే 2800 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జగన్ విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. రేపు విశాఖ నగరంలోకి ప్రవేశించే అవకాశముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నేడు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ కు సన్నిహితుడిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు పార్టీలో చేరుతుండటం విశేషం.
మరింత బలం......
ఆనం రామనారాయణరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పార్టీలో చేరిక మరింత బలాన్నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో సత్తా చాటింది. అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. నెల్లూరు లో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన కన్పించింది. ఆ స్పందన చూసి పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు.ఆయన చేరికతోనే నెల్లూరులో ఫ్యాన్ వచ్చే ఎన్నికల్లో బలంగా తిరుగుతుందని అంచనా వేశారు. తాజాగా రామనారాయణరెడ్డి చేరికతో స్వీప్ చేయడం ఖాయమంటున్నారు వైసీపీ శ్రేణులు.
ఇమడలేక.....
ఆనం రామనారాయణరెడ్డి తొలుత టీడీపీలో ఉన్నప్పటికీ ఎక్కువ కాలం రాజకీయాలు కాంగ్రెస్ తోనే కొనసాగాయి. దాదాపు దశాబ్దకాలం పాటు నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన ఆనం సోదరులు గత ఎన్నికల తర్వాత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అక్కడ ఇమడలేక సతమతమవుతూ పార్టీని వీడారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలుండటతో ఆనం ఫ్యాన్ పార్టీని ఎంచుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి రాకను నెల్లూరు జిల్లాలో కొందరు పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్ పట్టించుకోలేదు. ఆనంను సాదరంగా ఆహ్వానించడానికే నిర్ణయించుకున్నారు.
ఐదు నియోజకవర్గాల్లో.....
ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వద్దామనుకుంటున్న జగన్ కు బలమైన నేతలు ఎవరు వస్తున్నా కాదనడం లేదు. గ్రూపు తగాదాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని జగన్ నమ్మకంగా ఉన్నారు. ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఆనం కుటుంబానికి పట్టు ఉండటమే ఆయనను చేర్చుకోవడానికి ప్రధాన కారణం. గత ఎన్నికల్లో వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది. ఈసారి ఆ రెండింటినీ కైవసం చేసుకోవాలన్నది జగన్ ఆలోచన. అందుకే ఆనం రాకకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు జగన్.