కన్నా తర్వాత ఎవరు..? ట్రబుల్ లో కమలం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ట్రబుల్ లో పడుతుంది. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అయితే ఆయన తర్వాత పార్టీని ఎవరు వీడతారన్న చర్చ ప్రస్తుతం ఏపీ బీజేపీలో జోరుగా సాగుతుంది. ఏపీ బీజేపీలో కొందరి మాట చెల్లుబాటు అవుతున్నందున ఇక అందులో కొనసాగేందుకు కొందరు నేతలు ఇష్టపడటం లేదు. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని భావించి అందులోనే ఇమడలేక, అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ కొనసాగుతున్న వారు ఇక గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.
ీవీరి పెత్తనంతోనే...
ప్రధానంగా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, పార్టీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ లు పార్టీపై పెత్తనం చేస్తున్నారంటున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాల్సిన నేతలు తమ సొంత అజెండాను అమలు చేస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అధినాయకత్వం కూడా ఈ ముగ్గురి మాటలనే విశ్వసిస్తుంది. వారినే నమ్ముతుంది. వారు చెప్పిందే చేస్తుంది. అందుకే కన్నా వర్గానికి చెందిన వారిని పార్టీ పదవుల నుంచి సోము వీర్రాజు తొలగించినా అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. సోము వీర్రాజు తొలి నుంచి పార్టీలో ఉండటం, ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీలోకి రావడంతో ఆయనకు హైకమాండ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది.
టీడీపీతో పొత్తు లేదని...
ఇది గమనించిన మిగిలిన నేతలు సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే టీడీపీ అప్పటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది. వారికి బీజేపీ మరోసారి రాజ్యసభ ఇచ్చే అవకాశం కన్పించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ హైకమాండ్ కూడా ఉంది. ఢిల్లీ స్థాయిలో ఎంత లాబీయింగ్ చేసినా ఫలితం కన్పించడం లేదు. అధినాయకత్వం నుంచి సానుకూలత కూడా లేదు.
వారానికి ఒకరు...
ఈ నేపథ్యంలోనే టీజీ వెంకటేష్, సుజనా చౌదరి తిరిగి టీడీపీ గూటిలోకి చేరతారన్న ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్ కు మరికొంత కాలం రాజ్యసభ పదవి ఉండటంతో ఆయన ఇప్పుడిప్పుడే బీజేపీకి రాజీనామా చేయరంటున్నారు. వీరిద్దరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మరికొందరు నేతలతో పాటు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన నేతలు కూడా రేపో మాపో టీడీపీలో చేరనున్నారని తెలిసింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23, 24 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశముంది. ఆ తర్వాత వారానికి ఒక నేత బీజేపీని వీడి తిరిగి సైకెలెక్కేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.