Free Bus For Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తాజా అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం తాజా అప్ డేట్ ఇచ్చింది

Update: 2024-12-22 03:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం తాజా అప్ డేట్ ఇచ్చింది. దీనిపై అథ్యయనం చేయడానికి మంత్రుల కమిటీని నియమించింది. హోం శాఖ, రవాణాశాఖ, మహిళ శిశు సంక్షేమశాఖకు చెందిన మంత్రులతో కమిటీని నియమించింది. ఈ మంత్రుల కమిటీ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. వీలయినంత త్వరగా మంత్రుల కమిటీ తన నివేదికను ఇవ్వాలని తెలిపింది. అక్కడ అమలవుతున్న విధానంతో పాటు లోటు పాట్లను కూడా అధ్యయనం చేసి తమకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.


సంక్రాంతి నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతికి అమలు చేయాలని భావించింది. అయితే సంక్రాంతికి ఇంకాకొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మంత్రుల కమిటీ ఎంత మేరకు అధ్యయనం చేసి ఈలోపు నివేదిక ఇస్తుందన్నది మాత్రం తెలియరాలేదు. అయితే ఇప్పటికే ఆర్టీసీ, రవాణా అధికారులు ఆ యా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఇప్పుడు మంత్రుల కమిటీని నియమించడానికి కారణమేంటన్న దానిపై చర్చ జరుగుతుంది. సంక్రాంతి నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని ఆర్టీసీకి చెందిన ఒక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మంత్రులు అధ్యయనం చేసి వచ్చిన తర్వాత దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు.
అభాసుపాలు కాకుండా...
మహిళలకు ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన చర్యలను కూడా ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే హడావిడిగా పథకాన్ని ప్రవేశపెట్టి అభాసుపాలు కావడం కంటే కొంత ఆలస్యమయినా అందరికీ ఆమోదయోగ్యంగానే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మరి సంక్రాంతి నాటికి ఈ పథకం అమలు కావడం కష్టంగానే కనిపిస్తుంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News