ఫస్టాఫ్.. సెకండాఫ్
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే అధికారంలోనూ రిపీట్ అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే అధికారంలోనూ రిపీట్ అవుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏపీలో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని రెండు పార్టీలకు చెందిన క్యాడర్ కూడా విశ్వాసంతో ఉంది. రెండు అధికారంలోకి వస్తే తొలి రెండున్నరేళ్లు చంద్రబాబు, చివరి రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఇది రివర్స్ అయినా ఆశ్చర్యం లేదు. జనసేన తొలి రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరే అవకాశముంది.
టూర్లు మాదిరిగానే...
ఇప్పుడు ఏపీలో టూర్లు కూడా అలాగే సాగుతున్నాయి. ముందుగా చంద్రబాబు వచ్చి పర్యటించి వెళతారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పరామర్శిస్తారు. అదే తరహా పాలన చూడబోతున్నామంటూ సోషల్ మీడియాలో ఇటు టీడీపీ, అటు జనసేన అభిమానులు పోస్టింగ్‌లు పెట్టడం చర్చనీయాంశమైంది. ఏపీలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు అనేక మంది నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఇంత వరకూ తడిసిన ధాన్యం అంతా రైతుల వద్దనే ఉంది.
రైతులను పరామర్శించి...
ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు రోజుల పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. రైతులను పరామర్శించారు. తడిసిన పంటను పరిశీలించారు. ప్రభుత్వానికి 72 గంటల పాటు డెడ్‌లైన్ కూడా విధించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే జగన్ ఇంటి వద్దకు ఆ ధాన్యం తీసుకువచ్చేలా రైతులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు కూడా. 72 గంటల డెడ్‌లైన్ ముగిసింది. దీంతో చంద్రబాబు కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు తెలియజేయాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.
బాబు అటు వెళ్లగానే...
చంద్రబాబు అటు తన పర్యటన పూర్తి చేసుకుని వెళ్లిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. కడియం, ఆవలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో ముగిసిన తర్వాత వారాహి యాత్ర ప్రారంభమవుతుందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే ఫస్టాఫ్ టీడీపీ, సెకండాఫ్ జనసేన ఇలా తమ కార్యక్రమాల మాదిరిగానే అధికారాన్ని కూడా పంచుకుంటాయన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. మరి చివరకు రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... జరిగిన.. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజమేననిపిస్తుంది.