ఆర్ధిక క్రమశిక్షణ ఏ మాత్రం లేదు. కేంద్రం నుంచి నిధుల విదిలింపు మరీ ఘోరం. పరిస్థితి అన్యాయంగా ఉన్నా ఖర్చులు మాత్రం రోజు పెరిగిపోతూనే వున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమ పథకాలకు నిధులన్నీ మళ్లించేస్తున్నారు. దాంతో ఎపి ఖజానా కుంగిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కానీ, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో కానీ అన్ని అగమ్యగోచరమే అయ్యింది. వరుసగా వస్తున్న విపత్తులు నష్టపరిహారాలు చెల్లింపులతో ఎపి ఆర్థిక శాఖ కు తిప్పలు మరింత పెరిగినట్లు తెలుస్తుంది. మరోపక్క ముఖ్యమంత్రి నుంచి మంత్రులు వరకు ప్రత్యేక విమానాల్లో విహారం, విదేశీ పర్యటనల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఆదాయం లేదు ఖర్చు చూస్తే బారెడుగా ఉండటంతో ఎపి అప్పుల కుప్పగా మారిపోయింది. ఇప్పటికే నిధుల కోసం అధిక వడ్డీతో బాండ్లను సైతం ఎపి జారీ చేసింది. అప్పులకు వున్న అన్ని అవకాశాలను సర్కార్ వాడుకుంటుంది.
రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్ ...
రోజు గడవటమే కష్టం గా మారిన పరిస్థితుల్లో ఎపి సర్కార్ నాలుగువందల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంది. దాంతో రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ఆందోళన వెలిబుచ్చింది. తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ ను రెండు వారాల్లో చెల్లించాలిసి వుంది. ఒక పక్క ఆదాయం కొన్ని శాఖల పరంగా పెరుగుతున్నా చాలా శాఖల ఖర్చు అంతు పొంతూ లేకుండా పోతుంది. దాంతో ఎపి ఆర్ధిక వ్యవస్థ చిన్నాబిన్నంగా నడుస్తుంది.
గట్టెక్కడం సవాల్....?
ఆర్ధిక వ్యవహారాల్లో తలపండిన చంద్రబాబు, యనమల వంటి వారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇలాంటి పరిస్థితి రావడం ఈ సమస్య నుంచి గట్టెక్కడం ఒక సవాల్. అయితే దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే చాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. కేంద్రం సాయం చేయకపోవడం వల్లే రాష్ట్రం ఈ దుస్థితిలో పడిందనే కలర్ ఇచ్చి తప్పు కు మోడీ దే బాధ్యత అని చెప్పే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు.