నా వెనక ఉన్నది ఆ నలుగురే

తన మనసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే ఉన్నారని జగన్ అన్నారు. తన వెనక ఉన్నది కూడా ఆ నలుగురేనని ఆయన తెలిపారు.

Update: 2022-12-07 08:02 GMT

తన మనసులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే ఉన్నారని జగన్ అన్నారు. తన వెనక ఉన్నది కూడా ఆ నలుగురేనని ఆయన తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జయహో బీసీ సభలో జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 82 వేల మంది బీసీలు పదవులు పొందారన్నారు. మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు ఎప్పటికీ కొనసాగుతారన్నారు. బీసీ లంటే బ్యాక్ వర్డ్ క్లాస్ లు కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని, బీసీలంటే వెనకబడిన కులాలు కాదని, వెన్నుముక లాంటి కులాలని ఆయన అన్నారు. బీసీ అంటేనే పరిశ్రమ అని జగన్ అన్నారు. ప్రతి ఇంటిలో కనిపించేది బీసీల శ్రమ ఫలితమేనని ఆయన అన్నారు.

బీసీ అంటే పరిశ్రమ...
బీసీ అంటే శ్రమ అని, పరిశ్రమ అని ఆయన అన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నం బీసీలని జగన్ అన్నారు. ఆధునిక విద్య బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దూరం చేయడం వల్లనే వెనకబాటుకు గురయ్యారన్నారు. తన పాదయాత్రలో ప్రతి ఒక్క కులాన్ని కలుసుకున్న తర్వాత వారి కష్టాలను తెలుసుకున్నానని అన్నారు. బీసీలంటే ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషన్లు కాదని చంద్రబాబుకు చెప్పాలన్నారు. 114 వాగ్దానాలను ఇచ్చి పదిశాతం కూడా అమలు చేయకుండా చంద్రబాబు 2014లో బీసీలను దగా చేశారన్నారు. ఈ ప్రభుత్వం మాది అని బాబుకు చెప్పమని జగన్ అన్నారు.
చంద్రబాబుకు గుర్తు చేయండి...
చంద్రబాబు చేసిన మోసాలను ఒక్కొక్కటిగా గుర్తు చేయమని జగన్ పిలుపునిచ్చారు. 139 కులాల పేరుతో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. బీసీ కమిషన్ ను శాశ్వత ప్రాతిపదికపైన దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేశామన్నారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారే ఎక్కువగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, తమ ప్రభుత్వంలో నలుగురిని పంపామని చెప్పారు. నామినేషన్ వర్క్ లలోనూ యాభై శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. బీసీల కోసం ఈ మూడేళ్లలో 1.63 లక్షల కోట్ల రూపాయలు ఖర్చును ఈ ప్రభుత్వం చేసిందని ఆయన గుర్తు చేశారు.
అందుకే ఒంటరిగా...
చంద్రబాబు నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లోకి వచ్చినా మంచి చేసి ఉంటే వైసీపీపై ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదన్నారు. చంద్రబాబు ఇతరుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారన్నారు. చేసిందేమిటంటే చెప్పుకునేది ఏమీ లేకపోవడం వల్లనే ఒంటరిగా పోట ీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా పేద ప్రజలకు నిరంతరం సాయం అందిస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రతి గడపకు సామాజిక న్యాయం చేరాలన్నదే తమ ఆకాంక్ష అని జగన్ తెలిపారు. మూడు రాజధానులంటే అనేక రకాలుగా అడ్డుపడుతున్నారని, ఎందుకంటే బాబు మార్క్ సామాజికన్యాయం వేరని జగన్ అన్నారు. చంద్రబాబు నయవంచనను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి వెళ్లి 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పాలని కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ మారీచులతోనూ, పెత్తందారులతో యుద్ధం చేయాలని చెప్పాలని, 2024 చంద్రబాబుకు చివరి ఎన్నికలు చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు.


Tags:    

Similar News