ఏపీకి ఏమిటీ ఖర్మ?

ఇటీవల విజయవాడలో వ్యూహం సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకాశం బ్యారేజీ దగ్గర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘తెలుగుదేశం వాళ్లకి అందరి బట్టలు విప్పడం సరదా అనుకుంటాను. ప్రత్యర్థుల బట్టలిప్పిస్తాం అంటుంటారు. కానీ నేను నా సినిమాలో నిజం బట్టలిప్పి చూపిస్తాను’ అన్నారు.

Update: 2023-08-24 14:05 GMT

 సహనం కోల్పోతున్న నేతలు... చీదరించుకుంటున్న పబ్లిక్‌

ఇటీవల విజయవాడలో వ్యూహం సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకాశం బ్యారేజీ దగ్గర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘తెలుగుదేశం వాళ్లకి అందరి బట్టలు విప్పడం సరదా అనుకుంటాను. ప్రత్యర్థుల బట్టలిప్పిస్తాం అంటుంటారు. కానీ నేను నా సినిమాలో నిజం బట్టలిప్పి చూపిస్తాను’ అన్నారు.

వర్మ వెర్షన్‌ ఎలా ఉన్నా మన ప్రజాప్రతినిధులంతా చవకబారు విమర్శల్లో మునిగి తేలుతున్నారు. ఒకరు బట్టలిప్పిస్తా అంటారు, మరొకరు నడిరోడ్డు మీద నిక్కర్‌తో నడిపిస్తానంటారు. ఇంకొకాయన తోలుతీస్తా, గొంతు పిసుకుతా అంటారు. ఓ మహిళా మంత్రిగారు ప్రత్యర్థికి కౌంటర్‌ ఇవ్వాలన్న ఉత్సాహంతో సంస్కారాన్ని పక్కన పెట్టి మాట్లాడతారు. మరో ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని పట్టుకుని ‘జగన్‌.. ఎవరు నువ్వు?’ అని అడుగుతాడు. మరో అధికార పార్టీ ఎమ్మెల్యే నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రిని ‘తుప్పు నాయుడు’ అంటూ నోరు పారేసుకుంటారు.

తమ చుట్టూ ఉన్న అభిమానుల చప్పట్ల కోసం మాట్లాడుతున్న ఈ మాటలతో తమ స్థాయిని తామే దిగజార్చుకుంటున్నామని సదరు నాయకులంతా గమనించడం లేదు. అసభ్యకర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిలో వారు మరింత చులకన అయిపోతున్నారు. సినిమాల్లో మాస్‌ హీరో ఇమేజ్‌ కోసం హీరోలంతా ప్రయత్నిస్తుంటారు. మాస్‌ అంటే నేలబారుకు దిగిపోవడం. మాస్‌ ఇమేజ్‌ వల్లే అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి లాంటి వాళ్లు సూపర్‌ స్టార్లుగా ఎదిగారు. కానీ రాజకీయం వేరు. సినిమా వేరు. మూడు గంటల సేపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తే చాలు. చప్పట్లు కొట్టి, ఈలలు వేసి వెళ్లిపోతారు. ఎంత మాస్‌గా ఉంటే అంత అభిమానిస్తారు.

కానీ ఓటేసే వాళ్లలో అన్ని వర్గాల వాళ్లూ ఉంటారు. ఉద్యోగులు, వ్మాపారులు, మధ్యతరగతి వాళ్లు, కార్మికులు, కర్షకులు. వీళ్లంతా మాస్‌ కాదు. రాజకీయ నాయకుల వీరాభిమానులు కూడా కాదు. తమ ప్రజా ప్రతినిధి నుంచి వాళ్లు కనీస హుందాతనాన్ని కోరుకుంటారు. నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి కూడా ఎమ్మెల్యే అవుతున్నారంటే అది పార్టీ మీద అభిమానమో, ప్రత్యర్థి మీద ద్వేషమో కావచ్చు. అంతే కానీ అసభ్యంగా మాట్లాడిన నేతలకు మాటలకు జనం ఆకర్షితులై వాళ్లను గెలిపించడం లేదు. ఈ విషయాన్ని విస్మరిస్తున్న మన నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారు. వాటిని చానళ్లలో చూసుకుంటూ తమకు పబ్లిసిటీ బాగా వస్తోందని, తాము నాయకులుగా బాగా ఎదిగిపోతున్నామని ఫీలవుతున్నారు. రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అని పార్టీ వర్గాలు భావిస్తున్న ఓ యువకిశోరం ‘నేను మూర్ఖుడ్ని’ అని చెప్పుకుని తిరుగుతున్నారు. మూర్ఖులకు ఓటేసి గెలిపించే అపరివక్వతలో జనం లేరు. ఇలా ఒకరని కాదు. అంతా ఆ తాను ముక్కలే. వీళ్లంతా విమర్శల్లో ఏ రోజుకారోజు మరింత అగాధంలోకి దిగిపోతుండటం ఏపీ వాసుల ఖర్మ.

Tags:    

Similar News