నేడే కౌంటింగ్.. ఎవరు విన్నర్?
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలట్ల లెక్కింపుతో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతంుది. తక్కువ స్థానాలే కావడంతో గంటల్లోనే ఫలితాలు వెలువడే అవకాశముంది. మూడు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీకే అవకాశాలున్నాయని తేలింది. మేఘాలయలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాలు వినిపించాయి.
నాగాలాండ్, మేఘాలయ...
అరవై అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీకి గత నెల 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 59 స్థానాలు ఎస్టీ నియోజకవర్గాలు కాగా, ఒకటి జనరల్ స్థానం. అలాగే అరవై అసెంబ్లీ నియోజకవర్గాలున్న మేఘాలయ అసెంబ్లీకి కూడా ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 55 ఎస్టీ నియోజకవర్గాలు కాగా, జనరల్ కోటాలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి.
త్రిపురలో...
ఇక త్రిపుర విషయానికొస్తే ఇక్కడ కూడా అరవై అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ముప్ఫయి జనరల్ స్థానాలు, పది ఎస్సీ, 20 ఎస్టీ స్థానాలున్నాయి. కమ్యునిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో రెండో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాదా? అన్నది చూడాల్సి ఉంది. ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పది గంటలకల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.