వచ్చేవి ఎన్నికలు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోవు. ఇప్పుడు బిజెపి కూడా అదే చేస్తుంది. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి మరణాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. దేశ వాసుల్లో అటల్ కి వున్న క్లీన్ ఇమేజ్, సెంటిమెంట్ లను ఉపయోగించుకోవాలని భాజపా అధిష్టానం మాజీ ప్రధాని అస్తిక నిమజ్జన కార్యక్రమం భారీగా చేపట్టాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో అటల్ అస్థికలు నిమజ్జనం చేయనున్నారు. వాస్తవానికి ప్రధాని స్థాయిలో పని చేసిన వారికి దేశ సేవలో పునీతులై తమ జీవితాలు త్యాగం చేసేవారికి ఆ విధమైన గౌరవం సర్వ సాధారణమే. ఈ తరహా సంప్రదాయానికి గతంలో తెరలేపింది కాంగ్రెస్ పార్టీనే. వారిబాటలోనే ఇప్పుడు కమలం పార్టీ అడుగులు వేస్తుంది.
అంతా చుట్టేయాలి ...
దేశమంతా వాజ్ పేయి అస్థికలు ప్రధాన నగరాల్లో ఊరేగించి నదుల్లో కలపాలని బిజెపి నిర్ణయించింది. తాజాగా హరిద్వార్ లో తొలిగా చేసిన అటల్ అస్తికల నిమజ్జనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ లు అనేక మంది ప్రముఖులు హాజరు అయ్యారు. ఇదే తరహాలో కార్యక్రమాలు సాగించాలని బిజెపి భావిస్తుంది. ఎన్నికల తరుణం ముంచుకొస్తుండటంతో కమలం రాజకీయ కోణంలోనే ప్రతి అంశాన్ని అమలు చేస్తుందంటున్నారు విశ్లేషకులు.