ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పుకోవడానికే అసహ్యంగా తయారయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇది మరింత జగుప్సాకరంగా తయారయింది. ఎక్కడైనా...ఎవరిమీద అయినా...శత్రువు మీదైనా దాడి జరిగితే కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కాని నిన్న జరిగిన ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇది ఎక్కడా కన్పించలేదు. పైగా కొత్త అర్థాలు దీన్నుంచి తీస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, నలభై ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు సయితం మీడియా సమావేశంలో ఒకింత అసహనంగా కన్పించడం దీనికి అద్దం పడుతోంది.
జగన్ కు ఆ అవసరమేంటి?
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత 11 నెలలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు ప్రజాసంకల్ప పాదయాత్ర చేశారు. పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సర్వేలు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడి డ్రామా ఆడాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చిందన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. జగన్ సానుభూతి కోసం తనపై తాను దాడి చేయించుకున్నాడన్నది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. అయితే దీనిని నీచాతినీచమైన ఆరోపణగా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. తాము అధికారంలోకి ఈసారి ఖచ్చితంగా వస్తామన్న ధీమాలో ఉన్నామని, తమకు ఎలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదంటున్నారు వైసీపీ నేతలు.
ఎవరీ వీర శివాజీ....?
ఇక ఆపరేషన్ గరుడ అనేది మళ్లీ తెరపైకి తెచ్చారు? ఎవరీ శివాజీ? ఆయన కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ కు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బ్రెయిన్ ఉన్నట్లుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. శివాజీ చెప్పిన గరుడ కథకు చంద్రబాబు కూడా అధికార ముద్ర వేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగుతుండగా ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏముంటుందన్నది బీజేపీ నేతల వాదన. అలా చేస్తే సానుభూతి పెంచుకోని మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడానికి తామెందుకు అవకాశం కల్పిస్తామంటోంది. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ తోనే వీర శివాజీ తో స్కెచ్ వేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్ పై హత్యాయత్నం సంఘటన పక్కదారి పట్టే విధంగా నేతల స్టేట్ మెంట్లు ఉండటం గమనార్హం.