ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వారిద్దరే. ఒకరు సిఎం రమేష్ మరొకరు జివిఎల్ నరసింహ రావు. ఇద్దరి నడుమ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఏపీలో ఐటి రైడ్స్ మొదలైన దగ్గరనుంచి వీరినడుమ మొదలైన మాటల యుద్ధం రోడ్ ఎక్కి ఛానెల్స్ కి రేటింగ్స్ పెంచే స్థాయికి వెళ్ళింది. తాజాగా జివిఎల్ చేసిన ఆరోపణలు విమర్శలతో ప్రతి దాడి చేశారు రమేష్. దాంతో వీరి నడుమ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదని తేలిపోతుంది.
రమేష్ పై ఎందుకు ...?
టిడిపి ఆర్ధిక అవినీతి మూలాలన్నీ సిఎం రమేష్, సుజనా చౌదరి, నారాయణ వంటివారి దగ్గరే వున్నాయన్న బలమైన ఆధారాలు సేకరించింది బిజెపి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో నిలవాలంటే తాము మద్దతు ఇచ్చేవారు గెలవాలన్న పసుపు కోట ఆర్ధిక మూలాలు నాశనం చేయడం కమలం యుద్ధ వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. నేరుగా చంద్రబాబు ను లోకేష్ ను టార్గెట్ చేయకుండా వారి బినామీలుగా ఆరోపణలు వున్న వారిపై దాడులు మొదలు పెట్టింది కేంద్ర ఆర్ధిక నేర నియంత్రణ విభాగాలు. రావడం రావడమే రమేష్ పై పడిపోయి మానసికంగా టిడిపి పై విజయం సాధించింది కమలం. వీరి దాడుల్లో సీన్ ఏమి లేదని నిరూపించుకునే క్రమంలో మీసం మెలేసి రమేష్ తొడకొట్టడంతో కసి మీద వున్న జివిఎల్ జాతీయ మీడియా లో ప్రచురితమైన వార్తలను ఆయుధాలుగా చేసుకుని మరోసారి రంగంలోకి దిగారు. 100 కోట్ల రూపాయల దొంగ ఇదిగో అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ఎదురుదాడి కి దిగిన రమేష్ ...
ఆ వెంటనే రంగంలోకి దిగిన రమేష్ తాను వంద కోట్ల రూపాయల అంశం పై విచారణకు సిద్ధమని అమిత్ షా రాఫెల్ డీల్ పై విచారణకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ చేశారు. తమపై కేంద్ర ప్రభుత్వం కావాలనే కేంద్రం బురద జల్లుతుందనే ఆరోపణలు సంధించారు ఆయన. రమేష్ కి మద్దతుగా టిడిపి నేత ఎమ్యెల్సీ బుద్దా వెంకన్న సీన్ లోకి వచ్చారు. ఆయన జివిఎల్ పై నేరుగా ఆరోపణలు మొదలు పెట్టేశారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు తీవ్రం చేసుకుంటూ మొత్తానికి అయోమయం రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి బిజెపి, టిడిపిలు. ఈ ప్రభావం ఏ పార్టీకి లబ్ది చేకురుస్తుందో చూడాలి మరి.