రాజాసింగ్... సస్పెన్షన్ వేటు అందుకేనా?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలంపార్టీకి తలనొప్పిగా మారారు. అదుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు
భారతీయ జనతా పార్టీ లో ఇప్పటి వరకూ నేతలు కొంత మృదు స్వభావులుగా ఉన్నారు. నాడు ఆలే నరేంద్ర కొంత ఫైర్ బ్రాండ్ గా ఉన్నప్పటికీ ఆయన మరణం తర్వాత ఏ నేత పెద్దగా వివాదం కాలేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ‌్ వరకూ స్మూత్ గా వెళ్లేవారే. వారు రాజకీయ విమర్శలు చేస్తారు. ఎంఐఎంను టార్గెట్ చేస్తారు. అంతే తప్ప మతాలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయరు. ప్రస్తుత రాష్ట్ర అధ్కక్షుడు బండి సంజయ్ కూడా కొంత దూకుడుతోనే ఉన్నా మతసంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తుంటారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కమలంపార్టీకి తలనొప్పిగా మారారు.
రెండోసారి ఎమ్మెల్యేగా...
కానీ రాజాసింగ్ అలా కాదు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి రాజాసింగ్ ఎదిగారు. 2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడగా 2014, 2018 ఎన్నికల్లో వరసగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా నిలిచారు. అప్పటి నుంచి రాజాసింగ్ రెచ్చిపోతున్నారు. ఒకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని వ్యవహరిస్తున్నారు. గోషామహల్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఆయన తన టార్గెట్ అంతా ఎంఐఎం లక్ష్యంగానే చేసుకుని పని చేస్తున్నారు.
42 కేసులు...
ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అక్కడి ఓటర్లను బెదిరించారన్న కారణంపై రాజాసింగ్ పై ఎన్నికల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. నిషేధం కూడా విధించింది. రాజాసింగ్ పై ఇప్పటి వరకూ 42 కేసులు నమోదయ్యాయి. అందులో మతపరమైన వ్యాఖ్యలే ఉండటం ఇందుకు నిదర్శనం. 36 కేసులు కొట్టివేశారు.రాజాసింగ్ ను కట్టడి చేసేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆయన రాష్ట్ర నాయకత్వంతో కూడా విభేదించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. రెండో సారి గెలవడంతో ఆయనకు శాసనసభ పక్ష నేతగా బీజేపీ బాధ్యతలు కూడా అప్పగించింది.
ఫిర్యాదుల వెల్లువతో...
కానీ రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్ లో అగ్గిరాజుకుంది. దీంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. హిందూ ధర్మం కోసం చావనైనా చస్తానని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆయనపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందంటున్నారు. హిందూ వాహిని సభ్యుడిగా, గో సంరక్షణ, శ్రీరామనవమి శోభాయాత్రతో రాజకీయంగా ఎదిగిన రాజాసింగ్ చివరకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనపై అధినాయకత్వం కూడా గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడాలన్న తపనతో ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.