అహ్మదాబాద్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని
లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు.
అహ్మదాబాద్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండ్రోజులు భారత్ లో పర్యటించనున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వైద్యశాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం బోరిస్ ఢిల్లీకి వెళతారు. కాగా.. బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో ఆయన భారత్ రావాలనుకున్నా కరోనా కారణంగా రెండుసార్లు పర్యటన వాయిదా పడింది. బ్రిటన్ లో ఉన్న భారతీయుల్లో అత్యధికంగా గుజరాత్ వాసులే ఉండటంతో ఆయన నేరుగా అహ్మదాబాద్ కు వచ్చారు.