సెలబ్రిటీలు...కాదు...సామాన్యులే...!!

Update: 2018-12-07 11:00 GMT

సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేవారు చాలా కాలంగా ఎన్నికలకు దూరంగా వుంటూ వచ్చేవారు. కానీ ఈసారి వారిలో కూడా చైతన్యం వెల్లివిరిసింది. తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు హుషారుగా కుటుంబం మొత్తంతో వచ్చి ఓట్లు వేసి మీడియా ముందుకు వచ్చి తమ వేలికి పెట్టిన చుక్క అందరికి చూపిస్తూ ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తు చేశారు. నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఎన్నికల సంఘం, సామాజిక వేదికలు పెద్ద ఎత్తున ప్రచారం సాగించాయి. ఈ ప్రచారానికి సెలబ్రిటీల మద్దతు ఓటింగ్ ను మరింత పెరిగేలా చేసింది.

మెగా, నందమూరి కుటుంబాలు.....

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబసమేతంగా విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగా కుటుంబంలో నాగబాబు, అల్లు అర్జున్ ఇతర స్టార్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక దగ్గుబాటి కుటుంబంలో దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఓటు వేశారు. నాగార్జున, శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ ఓటు వేశారు ఇక నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, సుహాసిని, తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అక్కినేని నాగార్జున, అమల, సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల దంపతులు, విజయశాంతి, ఓటింగ్ లో హుషారుగా పాల్గొన్నారు. మంచు లక్ష్మి, ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, రాజమౌళి ఓటు హక్కు వినియోగిస్తే రాజమౌళి భార్య రమా రాజమౌళికి ఓటు గల్లంతు కావడంతో షాక్ తగిలింది.

రాజకీయ ప్రముఖులు ...

పలువురు రాజకీయ ప్రముఖులు అంతా ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లను చైతన్యపరిచారు. రాజకీయ ప్రముఖుల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు తమ తమ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహాకూటమి నేతలు ఉత్తమకుమార్ రెడ్డి, రమణ, కోదండరాం, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానా రెడ్డి, బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎంఐఎం నేతలు అసద్ వుద్దీన్ ఒవైసి, అక్బర్ ఉద్దీన్ ఒవైసి తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఈసారి సెలబ్రిటీలు ఉదయాన్నే వచ్చి పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నించుని ఉండటం విశేషంగానే చెప్పుకోవాలి.

Similar News